శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సున్నం చెరువు, తమ్మిడికుంట చెరువుల వద్ద చేపట్టాల్సిన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ బుధవారం స్వయంగా పరిశీలించి సమీక్షించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ రెండు చెరువుల వద్ద పర్యటించి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

ఈ పర్యటనలో కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, మాదాపూర్ డివిజన్ ఏసీపీ సీహెచ్. శ్రీధర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పి. రమేష్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, ఇతర అవసరమైన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ డా. ఎం. రమేష్ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.





