శేరిలింగంపల్లి, నవంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న H-CITI పనులను వేగవంతం చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఫాక్స్ సాగర్, కూకట్పల్లి వై-జంక్షన్, ఐడీఎల్ జంక్షన్లలో జరుగుతున్న, ప్రతిపాదిత అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ తనిఖీలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్, చీఫ్ సిటీ ప్లానర్తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫాక్స్ సాగర్ వద్ద ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్.. భూసేకరణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను సకాలంలో ప్రారంభించి పూర్తి చేసేందుకు నవంబర్ 15 నాటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కూకట్పల్లి వై-జంక్షన్, ఐడీఎల్ జంక్షన్లలో చేపడుతున్న పనులకు అవసరమైన భూములను ఎలాంటి న్యాయపరమైన వివాదాలు, ఇతర భారాలు లేకుండా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం వక్ఫ్ బోర్డు, ప్రభావిత ఆస్తుల యజమానులతో సమన్వయం చేసుకోవాలని టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆదేశించారు. ఫాక్స్ సాగర్ వద్ద ప్రధాన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి 2027 ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని కమిషనర్ ఆదేశించారు. కూకట్పల్లి వై-జంక్షన్, ఐడీఎల్ జంక్షన్లలో కొనసాగుతున్న పనులను కూడా వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
H-CITI కార్యక్రమం కింద చేపడుతున్న కీలక రహదారి అభివృద్ధి పనుల్లో భూసేకరణ సమస్యల పరిష్కారం, వివిధ శాఖల మధ్య సమన్వయం, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు కమిషనర్ సూచించారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.





