హైటెక్ సిటీ-బయోడైవర్సిటీ జంక్షన్‌లలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఐటీ కారిడార్‌లో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో పీక్ అవర్స్‌లో ఏర్పడుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన వన్‌వే లూప్ ట్రాఫిక్ విధానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) సున్‌ప్రీత్ సింగ్, ట్రాఫిక్ విభాగానికి చెందిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ట్రాఫిక్ అధికారులు, ఆర్టీసీ అధికారులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సీఈఓ పాల్గొన్నారు.

బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్‌స్పేస్ రోటరీ, టైమ్స్ స్క్వేర్ రోడ్, నాలెడ్జ్ సిటీ రోడ్, క్వాల్కామ్, డల్లాస్ సెంటర్ రోడ్ మీదుగా తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునే విధంగా వన్‌వే లూప్‌ను ప్రతిపాదించారు. ఈ మార్గంలో IKEA, T-Works, T-Hub తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రవాహాన్ని అధికారులు పరిశీలించారు. ప్రతిపాదిత మార్గంలో వాహనాల రాకపోకల సరళి, రహదారుల ప్రస్తుత పరిస్థితులు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న ప్రాంతాలు, వాహనాల మధ్య సంఘర్షణ పాయింట్లను సీపీ సమీక్షించారు. వన్‌వే విధానం అమలుతో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు వాహనాల రాకపోకలను సులభతరం చేయడం, ప్రమాదాలకు దారితీసే ట్రాఫిక్ సంఘర్షణలను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సమగ్ర ట్రాఫిక్ ప్రవాహ అధ్యయనం చేపట్టి, గుర్తించిన సమస్యలు, ట్రాఫిక్ అవరోధాలు, సంఘర్షణ పాయింట్లను దృశ్య ఆధారాలతో సహా పొందుపరుస్తూ సమగ్ర అజెండా నోట్ సిద్ధం చేయాలని సీపీ ఆదేశించారు.

అలాగే ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న భవనాలను బ్లాక్‌ల వారీగా అంచనా వేయాలని సూచించారు. ప్రతి భవనం నుంచి రోజువారీగా ఉత్పన్నమవుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్‌పై వాటి ప్రభావం, అందుబాటులో ఉన్న పార్కింగ్ సదుపాయాలు, వాటి సామర్థ్యంపై స్పష్టమైన వివరాలతో నివేదిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. T-Hub, IKEA, నాలెడ్జ్ సిటీ, క్వాల్కామ్, బయోడైవర్సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలను గుర్తించడమే ఈ అధ్యయనం ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. వన్‌వే లూప్ ప్రతిపాదనపై చేపట్టిన ఈ పరిశీలన, ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించడంలో కీలకంగా మారనుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here