శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన కేసులో మియాపూర్ మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. ప్రేమ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల సాధారణ కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో రెండు వారాల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

హఫీజ్‌పేట్‌లోని గోకుల్ ప్లాట్లు 62, 63, 73, 74కు సంబంధించి సుమారు 700 గజాల స్థలంపై ఎ. శేఖర్ బాబు, మరో ఏడుగురికి శాశ్వత ఇంజక్షన్ డిక్రీ ఉంది. తమ ఆధీనంలోని స్థలానికి పోలీసు రక్షణ కల్పించాలని వారు కోరగా, 2019 ఆగస్టు 20న తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు కాలేదని ఆరోపిస్తూ శేఖర్ బాబు తదితరులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 2023 జులై 13న మియాపూర్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్ కుమార్.. ఈ వ్యవహారం తన దృష్టికి 2023 నవంబర్ 7న వచ్చిందని కోర్టుకు తెలిపారు. అనంతరం స్థలాన్ని సందర్శించి నిర్మాణ పనులను నిలిపివేశానని, జరిగిన పరిణామాలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు.
అయితే ఆయన వివరణను హైకోర్టు అంగీకరించలేదు. కేవలం స్థలాన్ని సందర్శించడం మాత్రమే కోర్టు ఆదేశాలను అమలు చేసినట్లుగా పరిగణించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరో కేసు పెండింగ్‌లో ఉందనే కారణంతో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఉండటానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. Contempt of Courts Act సెక్షన్ 19 ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ విధించిన శిక్షను హైకోర్టు రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.





