శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలో వర్షాకాలంలో ఎదురవుతున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రెండు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న RCC బాక్స్ డ్రైన్ల పనులకు సంబంధించి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ CMC అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. మయూరి నగర్ కాలనీలోని దివి రెసిడెన్సీ నుంచి శ్రీ దివ్యశ్రీ శక్తి వరకు, నడిగడ్డ తాండ నుంచి SMR హైల్యాండ్ అపార్ట్మెంట్స్ వరకు నిర్మించనున్న వరద నీటి మళ్లింపు కాలువల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీరు ప్రవహించే మార్గాలు, నీరు నిలిచిపోయే ప్రాంతాలపై అధికారులతో చర్చించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు కాలనీలు, అపార్ట్మెంట్ల పరిసరాల్లో నీరు నిలవకుండా శాస్త్రీయ పద్ధతిలో పటిష్టమైన RCC బాక్స్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్తులో పెరిగే నివాస ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని తగిన సామర్థ్యంతో కాలువలు నిర్మించాలని శ్రీకాంత్ కోరారు. పనుల్లో సాంకేతిక లోపాలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ప్రణాళికాబద్ధంగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని CMC అధికారులకు సూచించారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ఉమ్మడి మియాపూర్ డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వరద నీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో CMC AEE ప్రశాంత్, CRPF అధికారి నాగేశ్వర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.






