– సైబర్ నేరాల పట్ల యూజర్లకు అవగాహన కల్పించాలని సూచన
– సానుకూలంగా స్పందించిన గూగుల్ ప్రతినిధులు
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం స్థానిక గూగుల్ సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్ట్ అండ్ లిటిగేషన్ కౌన్సిల్ నోడల్ ఆఫీసర్ గీతాంజలి దుగ్గల్, గూగుల్ ప్రతినిధులు సునీతా మొహంతీ, దీపక్ సింగ్, క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్యాం బాబు, ఇతర కమిషనరేట్, సైబర్ క్రైం పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ గూగుల్ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు.

గూగుల్ ప్లాట్‌ఫాంను ఆధారంగా చేసుకుని సైబర్ నేరస్థులు ఏవిధంగా మోసాలు చేస్తున్నదీ సీపీ సజ్జనార్ వివరించారు. గూగుల్ యాడ్ సర్వీస్‌ను ఉపయోగించుకుని మోసపూరిత ప్రకటనలు ఇస్తుండడం, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో పెడుతుండడం, గూగుల్ ఇతర సర్వీస్‌లను మోసం చేసేందుకు వాడుతుండడం, అనుచితమైన, అసభ్యకరమైన వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగింపు, జీమెయిల్ ఐడీలు, యూట్యూబ్ చానళ్లకు చెందిన ఐపీ అడ్రస్‌లు, ఇతర వివరాలు, గూగుల్ పే లావాదేవీల వివరాలు.. తదితర అనేక అంశాలపై సీపీ సజ్జనార్ గూగుల్ ప్రతినిధులతో చర్చించారు.

గూగుల్ సర్వీస్‌లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయకుండా అరికట్టాలని సీపీ గూగుల్ ప్రతినిధులకు సూచించారు. ఇంటర్నెట్ యూజర్లకు ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు గూగుల్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారు. తాము సైబర్ నేరాలను అదుపు చేసేందుకు సైబరాబాద్ పోలీసులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వారు అడిగే వివరాలను అందజేస్తామని తెలిపారు. కాగా అత్యవసర సమయాల్లో పోలీసులకు రోజులో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఓ నోడల్ ఆఫీసర్‌ను నియమించాల్సిన అవసరం ఉందని సీపీ సూచించగా, అందుకు గూగుల్ ప్రతినిధులు సుముఖతను వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
