చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని ఇందిరానగర్ కాలనీలో పల్లపు అశోక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను స్థానిక భెల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు.

కాగా అశోక్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దేవి (20)కి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆమె ఈ నెల 19వ తేదీన ఉదయం 4 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. అనంతరం తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు అన్ని చోట్లా గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.