నమస్తే శేరిలింగంపల్లి: హోమ్‌లోన్ ఇప్పిస్తానని మహిళకు మాయమాటలు చెప్పి ఏకంగా తన పేరిట ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకుని మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మోసపోయిన మహిళా బాధితులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ పోలీస్ కాలనీ 8వ బెటాలియన్ రోడ్డు సమీపంలో గత 18 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నల్లబోతుల రంగస్వామి, నల్లబోతుల పార్వతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. శ్రీ రామ్ నగర్ కాలనీ లోని ప్లాట్ నం 536/A లో ఉన్న 200 గజాల జి ప్లస్ వన్ ఇంటిని ఇంటిని 2018 డిసెంబర్ 18 న ఇద్దరు కూతుళ్లకు గిప్ట్ డీడ్ చేయించారు. ఐతే పంచరి సురేష్ అనే వ్యక్తి చిన్న కూతురుకి ఫోన్ చేసి ఇంటి పై హోమ్ లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నమ్మించి మభ్య పెట్టి 2020 ఆగస్టు 10న సురేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. 2021 సెప్టెంబర్ ఒకటో తేదీన అసలు నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వారు మోసపోయారని తెలుసుకొని తీవ్ర మనస్తాపానికి లోనై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సురేష్ పై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.