అంత్యక్రియలు జరిపే స్మశానవాటికలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.. ఊరి చివర చెత్త చెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానం వంటి హైక్లాస్ స్మశానవాటికలైతే కొంచెం నిర్వహణ బాగుంటుంది కాబట్టి ఆధునిక హంగులతో కొంచెం గొప్పగానే ఉంటాయి. మరి పైన ఫొటోలో కనిపించే పాలరాతి భవనంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు అంటే నమ్మగలరా…? జస్వంత్ థాడా గా పిలువబడే ఈ నిర్మాణం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ నగరంలో ఉంది ఈ జస్వంత్ థాడా. ఈ నిర్మాణాన్ని మహారాజా సర్దార్ సింగ్ 1899 లో తన తండ్రి మహారాజ జస్వంత్ సింగ్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం ఈ స్మృతి చిహ్నంతో ఈ నిర్మాణాన్ని నిర్మించాడు. అనంతరం ఇక్కడ మార్వార్ రాజ వంశస్తుల అంత్యక్రియలు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు. రాజ వంశస్తులంటే ఆమాత్రం ఉండాలి కదా..!పలుచని పాలరాతి పలకలతో నిర్మించి పాలిష్ చేయడం వల్ల సూర్యకిరణాలు ఈ పాలకులపై పడినప్పుడు ఈ నిర్మాణం వెలిగిపోతూ ఉంటుంది. జస్వంత్ థాడా లో పచ్చని గార్డెన్, చిన్న సరస్సుతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చక్కటి పర్యాటక కేంద్రంగా మారింది. రాజస్థాన్ వెళ్ళినప్పుడు మీరూ ఈ జస్వంత్ థాడా ను తప్పక సందర్శించండి.