- గణేశ్ వేడుకలపై ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం
- ఇన్సిడెంట్ ఫ్రీగా, ఘనంగా వేడుకలు జరుపుకోవాలని సూచన
నమస్తే శేరిలింగంపల్లి: గణేష్ వేడుకలను నిర్విఘ్నంగా, ఘనంగా, గౌరవప్రదంగా జరుపుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., తెలిపారు.
రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యుఎస్ & ఎస్బి, టిఎస్ఎస్ పిడిసిఎల్, ఫైర్ సర్వీసెస్, ఇరిగేషన్, రోడ్ ట్రాన్స్ పోర్ట్, ఆర్ & బి, మెడికల్, మున్సిపల్ శాఖలు, రెవిన్యూ, పంచాయతీ రాజ్, ఎంఏయుడి, తదితర శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (బిజి యుఎస్) ప్రతినిధులతో కలిసి సైబరాబాద్ సీపీ ఆఫీసులో ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన ప్రారంభమై, సెప్టెంబర్ 28 వరకూ కొనసాగానున్నాయని తెలిపారు. ఈ ఏడాది 1200 వరకు వినాయకుల ప్రతిష్ట ఉండొచ్చని అంచనా వేశామన్నారు. గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు పోలీసులు 24 X 7 పని చేస్తున్నారన్నారు. భద్రతాపరంగా పోలీసులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారన్నారు. గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో అందరు ఇన్స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు(BGUS) ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.
నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై దృష్టి సారించాము. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కల్లెక్టర్ ప్రతిమసింగ్, ఐఏఎస్., మాట్లాడుతూ.. జీహెచ్ ఎంసీ, మున్సిపాల్ సిబ్బందితో కలిసి శానిటైజేషన్ పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. అన్నీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ముందుగానే చెరువులు, బేబీ పాండ్స్ లను సూచించాలన్నారు. వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుంతులుగా ఉన్నరోడ్లను పూడ్చేలా ఆర్ & బి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్ లైట్లను, భారీ కేడ్లను నిర్మించాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలన్నారు. ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చేపట్టాలన్నారు.