- కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : ప్రజల ఆదరణ, నాయకులు, కార్యకర్తల సహకారానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పర్యటన సందర్భంగా హుడా కేఫ్, గంగారాం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో తాను ప్రాతినిధ్యం వహించిన చేవెళ్ల పార్లమెంట్ లో తాను చేపట్టిన అభివృద్ధి, పార్లమెంట్ లో తాను లేవనెత్తిన పలు అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకొని తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందిస్తున్న సహకారం, ఎక్కడికి వెళ్లిన సొంత మనిషిలా వారు చూపిస్తున్న ఆదరణ, బూత్ లెవెల్ కార్యకర్తల నుండి పైన స్థాయి నాయకుల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుపునకు చేస్తున్న కృషి చూస్తుంటే ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, ఎల్లప్పుడు తాను చేవెళ్ల కాంగ్రెస్ నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు. ఇదే చేవెళ్లలో తన కంటే ముందు 5 సంవత్సరాలు ఎంపీ గా చేసిన ప్రస్తుత భాజపా అభ్యర్థి అహంకార పూరిత మాటలు, నిరాధారమైన ఆరోపణలు బట్టి చూస్తే చేవెళ్ల లో కాంగ్రెస్ గెలుపు ప్రత్యర్థులకు భయాన్ని పుట్టిస్తున్నట్లు అర్ధమవుతుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ శేరిలింగంపల్లి అబ్జర్వర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండే నాయకులకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు. చేవెళ్ల లో ప్రజల మధ్యలో తిరిగే ఎంపీ గా గుర్తింపు పొందిన నాయకుడు జి.రంజిత్ రెడ్డి గెలుపునకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ నాయకులు, కృషి చేయడం బట్టి ఆయన నిబద్దత అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులను గెలిపించుకుంటే రానున్న రోజులలో చేవెళ్ల అభివృద్ధి పథం లో దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీ సోదరులు, మహిళా సోదరీమణులు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొన్నారు.