నమస్తే శేరిలింగంపల్లి : వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా సమగ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ ప్రారంభించింది. ఈ సందర్బంగా మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి, న్యూరోలాజిస్ట్స్ డాక్టర్ రంజిత్ , విక్రమ్ కిషోర్, గ్రూప్ డైరెక్టర్ ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం, రేడియోలోజిస్ట్ డాక్టర్ విజయకుమార్, సెంటర్ హెడ్ మాత ప్రసాద్ పాల్గొని బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని, వ్యాధిపై అవగాహన పెంచుకొని.. వెంటనే చికిత్స అందించడం ద్వారా యుక్త వయసు వారికీ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. స్ట్రోక్ వల్ల సమాజం ఎంతో నష్టపోతుందన్నారు. ఈ నేపథ్యంలో మెడికవర్ హాస్పిటల్స్ లో సమగ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం డాక్టర్ రంజిత్ న్యూరోలాజిస్ట్మా ట్లాడుతూ ఇలాంటి సమగ్రమైన న్యూరో స్ట్రోక్ సెంటర్స్ అతి కొద్దీ సెంటర్స్ లో మాత్రమే ఉన్నాయని, దీనివల్ల పేషెంట్ కు అన్ని రకాల సదుపాయాలు, ట్రీట్మెంట్స్ సరైన సమయంలో కంప్రెహెన్సీవ్ స్ట్రోక్ సెంటర్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.70 కోట్ల మంది స్ట్రోక్ బారిన పడుతున్నారని, ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఒక్కరైనా వారి జీవిత కాలంలో స్ట్రోక్‌కు గురౌతున్నారని వెల్లడించారు. దీని కారణంగా ప్రతి 6 సెకన్లకు ఒకరు చనిపోతున్నారని ఆ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతీ క్షణం విలువైనదే.. ఒక్క క్షణం ఆలస్యం చేసినా పరిస్థితి విషమించవచ్చు, కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయి దాటిపోవచ్చు, స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన మొదటి గంటలోపు.. కనీసం నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రి చేరితే ప్రాణాపాయంతో పాటు వైకల్యం నుంచి కాపాడొచ్చని జాగ్రత్తలు తెలిపారు. డాక్టర్ విక్రమ్ కిషోర్ – కన్సల్టెంట్ న్యూరోలాజిస్ట్ మాట్లాడుతూ ఫాస్ట్‌గా (ఎఫ్.ఏ.ఎస్.టి) ఉండండి. స్ట్రోక్ వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ప్రజలంతా ఫాస్ట్‌గా ఉంటే సరిపోతుందన్నారు. ఫాస్ట్ అంటే.. ఫేస్, ఆర్మ్, స్పీచ్, టైం. ముఖంలో పక్షవాతానికి సంబంధించి వస్తున్న మార్పులు, చేతులు, కాళ్లు పనిచేయడంలో వచ్చే మార్పులు, నోటి మాటలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అప్రమత్తంగా సమయానికి వైద్యులను సంప్రదించడమేనని అన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి సమయానికి వైద్యం అందే అవకాశం ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి సమయానికి వైద్యం అందక ప్రాణ, శాశ్వత అంగవైకల్య నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వారే మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం మాట్లాడుతూ ఎటువంటి ఎమర్జెన్సీ బ్రెయిన్ స్ట్రోక్ అయినా 24 /7 అందుబాటులో ఉండే డాక్టర్స్, ఇతర వైద్య సిబ్బంది , పేషెంట్ కు తక్షణమే సరైన వైద్యం.. సరైన సమయంలో అందిచడమే లక్ష్యంగా సమగ్రమైన న్యూరో సెంటరును ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ హెడ్ డాక్టర్ మాత ప్రసాద్ , ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.