ఈనాటి కవుల గానం అద్భుతం

  • చందానగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వేడుకగా కవి సమ్మేళనం
  • ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య వంగర త్రివేణి

నమస్తే శేరిలింగంపల్లి : శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ లోని విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆర్కిటెక్ట్ యెండూరి సురేష్ బాబు సౌజన్యంతో, పాలకమండలి సహకారంతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన సత్యసాయి జ్యోతి ప్రదీపన చేసి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఆచార్య వంగర త్రివేణి (హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం), గౌరవ అతిథులుగా ఆచార్య బాశెట్టి లత, చిత్రకవితా సామ్రాట్ చింతా రామకృష్ణారావు, అవధాని ములుగు అంజయ్య, కటకం వెంకటరామ శర్మ విచ్చేశారు. హాస్య బ్రహ్మ శంకరనారాయణ కవి సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ స్వాగతోపన్యాసం చేశారు.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న ముఖ్యఅతిథులు

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి, అతిథులు సమ్మేళనంలో పాల్గొన్న కవిపుంగవులు 60 మందిని సాంప్రదాయ బద్దంగా శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య వంగర త్రివేణి మాట్లాడుతూ… ఉగాది పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కవిసమ్మేళనానికి ఆహ్వానించడం తనకెంతో సంతోషాన్ని కలుగజేస్తుందన్నారు. ఈ ఆమని రాక పుడమికి పులకరింతలాంటిదని అన్నారు. మన సంస్కృతాంధ్ర కావ్యాలెన్నింటిలోనో వసంత ఋతు వర్ణనలు ఉన్నాయన్నారు. ఈనాటి కవుల గానం అద్భుతంగా ఉందన్నారు. అందరు గొప్పకవులు అని, అనుభవం గడించినవారని పేర్కొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వచ్చమైన, నిర్మలమైన మనస్సుతో ఆలాపించిన కవితలు రస భావానుభూతిని కలిగించాయని అన్నారు. తెలుగువారి ఆచార సంప్రదాయాలతో పాటుగా సామాజిక, సాంస్కృతిక అంశాలను కవులు తమ తమ కవితల్లో వర్ణించారని అన్నారు. ఇక పండుగ విశేషాలను తెలుపూ ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ప్రాశస్త్యాన్ని వివరించారు.


ఈ కార్యక్రమంలో ఆలయ పాలక కమిటీ సభ్యులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నండూరి వెంకటేశ్వర రాజు, విజయలక్ష్మి, జనార్ధన్, నల్లగొర్ల శ్రీనివాసరావు, జీ.వి. రావు, జిల్ మల్లేష్, ఉమా చంద్రశేఖర్, శివరామకృష్ణ, బారన్న, ఎం.ఎస్. నారాయణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here