నమస్తే శేరిలింగంపల్లి: హాఫిజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ కాలనీలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుంచి రూ. 3 లక్షల అంచనావ్యయం తో నూతనంగా 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, సీఐ తిరుపతి రావు, ఎస్సై యాదగిరితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు జనప్రియ నగర్ కాలనీ వాసులు ముందుకు రావడం అభినందనీయమని, ఇతర బస్తీ, కాలనీ వాసులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అదనపు కెమెరాలు ఏర్పాటు అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. సీసీ కెమెరాలతో కేసుల పరిష్కారం సులువవుతుందని, నేర శోధన, నేర నివారణకు అవి ఎంతోగానో తోడ్పడుతాయని తెలిపారు. అన్ని కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషిగా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా రూ. 1 కోటి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు నల్లా సంజీవ రెడ్డి, శ్రీనివాస్, కాలనీ ప్రెసిడెంట్ ప్రవీణ్, కోటేశ్వర రావు, వెంకట్ రెడ్డి, గురు ప్రసాద్, మృదుల, చలపతి, కృపాకర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.