నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి రూ. 1 కొటి నిధులతో ఆక్సీజన్ ప్లాంట్ మంజూరైనట్లు చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి కార్యాలయం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మెడికల్ ఆక్సీజన్ కొరత తీవ్రతరమవుతున్న సమయంలో ఎంపి రంజిత్ రెడ్డి పలుమార్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ అధికారులతో మాట్లాడి ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పించినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన నుండి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎంపి రంజిత్‌రెడ్డి ప్రతిరోజూ వైరస్ వ్యాప్తిపై సమీక్షిస్తూ కోవిడ్ రోగులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో మెడికల్ ఆక్సీజన్ వినియోగం పెరగడంతో కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని బిడిఎల్ ఉన్నతాధికారులకు లేఖ వ్రాసి వారు అంగీకరించే వరకూ చేసిన కృషి ఎట్టకేలకు ఫలించిందని అన్నారు. త్వరలోనే ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంటు నిర్మాణం ప్రారంభమవనున్నట్లు వారు తెలిపారు.






