నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ సాయి ఫంక్షన్ హాల్ లో భట్రాజుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
మాజీ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొల్లెపల్లి సీతారామరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో రవి కుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ.. ఆ రోజుల్లో భట్రాజులు విద్యావంతులుగా, గ్రామాల్లో విద్యని నేర్పిన భట్రాజులుగా ఉండేవారన్నారు. మారిన పరిస్థితుల పట్ల వారు చాలా రకంగా వెనుకబడి పోయారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భట్రాజులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం అంతే ఉందని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రాజు మాట్లాడుతూ చాలా వరకు తమ కాళ్ళపై తాము నిలబడుతూ జీవిస్తున్నామని, ప్రభుత్వాల నుంచి తమకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 800 మంది బట్రాజులు హాజరై వారి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, రాజు, కరుణాకర్, రాజు, శ్రీనివాసరాజు, విజయరాజు, గోమాత ప్రభావతి, వసుధా రాణి పాల్గొన్నారు.