- చందానగర్‌లో అనుమతులకు విరుద్ధంగా భారీ భవన నిర్మాణం
- అడుగడుగునా నిబంధనలకు తూట్లు – కన్నెత్తి చూడని టౌన్‌ప్లానింగ్ అధికారులు
నమస్తే శేరిలింగంపల్లి: సామాన్యులు ఒక చిన్న ఇళ్లు కట్టుకునే క్రమంలో తెలిసో తెలియకో చిన్నపొరపాట్లు చేస్తే వారికి చుక్కలు చూపించే జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు తమకు నచ్చిన, తమను మెప్పించిన నిర్మాణదారుల కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారు. చందానగర్‌లో అనుమతులు తుంగలో తొక్కి, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కోనసాగుతున్న ఓ భారీ భవన నిర్మాణాన్ని కాపాడేందుకు సర్కిల్, జోనల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం.
అనుమతులు రెండు… నిర్మాణం ఒకటే…
చందానగర్-అమీన్‌పూర్ రహదారిలో శ్రీదేవి థియేటర్ దాటిన తర్వాత విద్యానగర్ కాలనీ ముఖద్వారం సమీపంలో కుడివైపు కొంత ఖాలీ స్థలం ఉంది. చందానగర్ స.నెం.160/ఏ లోని సదరు స్థలం 664 చదరపు మీటర్లు అంటే దాదాపు 726 చదరపు గజాల విస్తీర్ణం. ఐతే ఈ స్థలాన్ని రెండుగా విభజించి 205.22 చ.మీటర్ల స్థలంలో డి.చంద్రశేఖర్ నాయక్ పేరుతో 2020 డిసెంబర్ 19న ఒక స్టిల్ట్ ప్లస్ మూడు పై అంతస్థులతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ నుంచి రెసిడెన్షియల్ నిర్మాణంకు అనుమతి (ప.నెం: 3/C21/12675/2020) తీసుతీసుకున్నారు. అదేవిధంగా మిగిలిన 459.33 మీటర్ల స్థలంలో భూక్యా రాంబాయి పేరుతో 2021 జనవరి 8న ఒక స్టిల్ట్ ప్లస్ నాలుగు పై అంతస్థులతో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం నుంచి రెసిడెన్షియల్ నిర్మాణం అనుమతి (ప.నెం: 2/C21/00397/2020) తీసుకున్నారు.
సెట్ బ్యాక్‌లు వదిలకుండా… సెల్లార్ నిర్మాణం…
అనుమతుల ప్రకారం రెండు నిర్మాణాలు విడివిడిగా కట్టాల్సి ఉండగా హెచ్ఎంసీ యాక్ట్, జీఓఎంఎస్ నెం.168కు విరుద్ధంగా, నిబంధనలు పూర్తిగా పక్కన బెట్టి రెండు భవనాలు కలిపి భారి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అంతేకాదు అనుమతి లేకున్నా భారీ సెల్లార్ నిర్మాణం చేపట్టారు. దానికి తోడు మూడు వైపులా తగినంత సెట్‌బ్యాక్స్ వదల కుండా ఏకంగా నాలుగు అంతస్థులు నిర్మాణం చేపట్టారు. ఐదవ అంతస్థు నిర్మించేందుకు సైతం ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే స్థానికులు ప్రశ్నించడంతో టౌన్‌ప్లానింగ్ అధికారుల సూచన, సలహాలతో నిర్మాణదారుడు సెల్లార్‌ను తాత్కాలికంగా మూసివేశారు. నిజంగా మూసివేసేదే ఐతే అంత ఖర్చుచేసి సెల్లార్ తవ్వాల్సిన అవసరం ఏముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలు గాలికొదిలినా… అదనపు అంతస్థుకు అనుమతి…
రెండు అనుమతుల్లో ఒక నిర్మాణానికి స్టిల్ట్ ప్లస్ త్రీ పర్మీషన్ మాత్రమే ఉంది. ఐతే ఒకవైపు నాల్గవ అంతస్థు నిర్మాణం చేపడుతూనే నిర్మాణదారులు అదనపు అంతస్థు అనుమతికి ధరఖాస్తు చేసుకున్నారు. జీఓ నెం.168 ప్రకారం పూర్వ అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణానికి అదనపు అనుమతులు ఇవ్వకూడదు. పైగా చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. ఐతే ఈ భవనం విషయానికి వస్తే రెండు అనుమతులు తీసుకుని కలిపి కట్టడం, సెల్లార్ తవ్వడం, అనుమతి లేకుండానే నాల్గవ అంతస్థు నిర్మాణం చెయడం, రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని కమర్షియల్ నిర్మాణం చేపట్టడం ఇలా అడుగడుగున నిబంధనలను ఉల్లంఘించారు. ఐతే నిర్మాణదారుడికి పూర్తిగా లొంగిపోయిన టౌన్‌ప్లానింగ్ అధికారులు తాజా నిర్మాణ పరిస్థితులను పొందుపరచాల్సిన సైట్ విజిట్ రిపోర్ట్‌లో నిర్మాణం ప్రారంభానికి ముందు తీసిన ఫోటోలు పొందు పరిచి మరీ తమ సహకారం అందించారు. అప్పటికే స్లాబ్ వేయడం పూర్తయిన భవనానికి ఈ ఏడాది సెప్టెంబర్ 20న టీఎస్‌బీపాస్‌లో నాల్గవ అంతస్థుకు అనుమతి (ప.నెం: 0350/GHMC/SLP/2021-BP) జారీచేశారు.
మార్టిగేజ్‌లో మర్మం ఏందో..?
సాధారణంగా భవన నిర్మాణానికి అనుమతి తీసుకునే క్రమంలో నిర్మాణంలోని 10 నుంచి 15 శాతం భాగాన్ని జీహెచ్ంఎసీకి తనఖా(రిజిస్టర్ మార్టిగేజ్) పెట్టాల్సి ఉంటుంది. ఒక వేళ నిర్మాణదారుడు నిబంధనలు తుంగలో తొక్కితే సదరు నిర్మాణానికి తనఖా విడుదల కాదు. ఆక్యూపెన్సీ సర్టిఫికేట్ ఆగిపోయి భవిష్యత్తులో ఆ స్థలం క్రయవిక్రయాలకు నోచుకోదు. ఐతే చంద్రశేఖర్ నాయక్, భూక్య రాంబాయిల పేరిట కొనసాగుతన్న సదరు నిర్మాణానికి సంబంధించి మార్టిగేజ్ విషయంలోను తేడా కనిపిస్తుంది. రిజిస్టర్ మార్టిగేజ్‌కు బదులు కేవలం నోటరీ పత్రాలను మాత్రమే పొందుపరిచారు. ఐతే రిజిస్టర్ మార్టిగేజ్ చేస్తేనే సదరు నిర్మాణంకు సంబంధించి ఈసీ తీసినప్పుడు జీహెచ్ఎంసి తనఖా పెట్టిన విషయం తెలుస్తుంది. ఇక్కడ నోటరీ పత్రాలపై సబ్‌రిజీస్ట్రార్ మార్టిగేజ్‌ను దృవీకరిస్తున్నట్టు సంతకం, స్టాంపులు లేనేలేవు. దీంతో ఈ తనఖా విడిపించుకోవాల్సిన అవసరమే లేదు. ఈ లెక్కన పూర్తి భవనం భేషరతుగా నిర్మాణదారుడు వశమవుతుంది.
వివరణ కోరితే దాటవేసిన ఏసీపీలు, సీపీ…
చందానగర్‌లోని సదరు భవన నిర్మాణ అనుమతులపై చందానగర్ సర్కిల్ ఏసీపీ సంపత్‌ను “నమస్తే శేరిలింగంపల్లి” వివరణ కోరగా జోనల్ వారు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి జోనల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ ఖుద్దూస్, సిటీ ప్లానర్ నర్సింహా రాముల్‌లను కదిలించగా అనుమతులను ఒకసారి పరిశీలించి స్పందిస్తామని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అధికారుల తీరును బట్టి అక్కడి పరిస్థితి అర్థం అవుతుంది. జోన్ పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిల్‌లలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. నమస్తే శేరిలింగంపల్లి వరుస కథనాలతో అలాంటి నిర్మాణాలపై పూర్తిగా ఫోకస్ చేయనుంది.
ఇంత తంతు జరుగుతున్న స్థానిక కార్పొరేటర్ కు తెలియకుండ ఉందా ఉదయం నుండి సాయంత్రం వరకు అదే రొడ్డులో తిరుగుతుటారు ఇప్పటివరకూ వారికి ఈ భవనం నిర్మాణం కనిపించలేదా కార్పొరేటర్ ఇంటికి 100 మీటర్ల దురంలోనే భవన నిర్మణం జరుగుతుంది కాదా