నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ఓంకార్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. పదమూడు నెలల చిన్నారి అదృశ్యమై ఇంటి సమీపంలో విగతజీవిగా కనిపించింది. వివరాల్లోకి వెళ్తే… ఓంకార్‌నగర్‌లో నివాసముండే రంగస్వామి దంపతుల కూతురు సోని ఆదివారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. జిహెచ్ఎంసి చెత్త సేకరణ వాహనంపై పనికి వెళ్లే రంగస్వామి, అతని భార్య పని నుండి ఇంటికి తిరిగి వచ్చే లోపు సోని కనిపించకపోవడంతో చుట్టుప్రక్కలా గాలించగా ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 13 సంవత్సరాల వయసు ఉండే ఓ బాలుడు చిన్నారిని ఎత్తుకుని ఉండటాన్ని స్థానికులు గమనించినట్లు చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుఝామున రంగస్వామి నివాసముండే గుడిసె సమీపంలో ఓ నీటి గుంట వద్ద సోని మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి పోట్టలో నీరు ఉండటం, నోరు, ముక్కు నుండి నురగలు రావడంతో నీటి గుంటలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి కళ్లు పొడిచినట్లుగా ఉండటంతో సోని మృతి వెనుక ఇంకెవరి హస్తమైనా ఉండవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప్రతికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోని అదృశ్యం, మృతి పట్ల స్థానికులు, కుటుంబ సభ్యులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పాప అమ్మమ్మ యాదృశ్చికంగా రంగస్వామి ఇంటికి రావడం, చిన్నారిని ఎత్తుకుని కనిపించాడన్న బాలుడు తిరిగి కనిపించకపోవడం, సోని కళ్లు పొడిచినట్లుగా ఉండటం తదితర అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పాప మృతికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.