నమస్తే శేరిలింగంపల్లి : బీపీ మండల్ డే కార్యక్రమం ఐదో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి సమాజంలో తలఎత్తుకునేలా చేసిన ఘనత బీపీ మండల్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ అని అన్నారు. 1979-80లో బీసీ మండల్ చైర్మన్‌గా బీసీల అభివృద్ధికి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి 40 సిఫార్సులు చేస్తే అందులో ఒక సిఫార్సును మాత్రమే అమలు చేసిందన్నారు. అది కూడా 1990లో అమలు చేశారన్నారు. నేడు బీసీలకు 27శాతం రిజర్వేషన్ రావడం ఆయన పుణ్యమేనన్నారు.
కుల జనగణన జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కొన్ని రాష్ట్రాలు కులగణనకు కేంద్రానికి సమ్మతి తెలియజేశారన్నారు. బీపీ మండల్ జమిందారు కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా విద్యార్థి దశ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలపై జరిగిన దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీపీ మండల్ అందజేసిన అన్ని సిఫార్సులను అమలు చేయాలని అన్నారు.