- విద్యుత్ శాఖ అధికారులతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో గచ్చిబౌలి విద్యుత్ శాఖ కార్యాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి డివిజన్ లో స్తంభాలకు వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయడం, ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచె వేయడం, అవసరమున్న చోట స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు, గృహ వినియోగదారులకు విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని వారిని ఆదేశించారు. విద్యుత్ లైన్లు, పురాతన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని సూచించారు. రోడ్డు మీద అడ్డంగా ఉన్న స్తంభాలను పక్కకు జరపాలని కోరారు. ఇందిరా నగర్ శ్మశాన వాటికలో రోడ్డు మధ్యలో ట్రాన్స్ ఫార్మర్లను పక్కకు జరపాలన్నారు. అనంతరం డివిజన్ లో నెలకొన్న విద్యుతు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో డీఈ గోపాల కృష్ణ, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ఇందిరా నగర్ కాలనీ వాసులు రవి ధనరాజ్ పాల్గొన్నారు.