సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాష్ రెడ్డి, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
వృద్ధాశ్రమంలో సీపీ సజ్జనార్ కుటుంబసమేతంగా నూతన సంవత్సర వేడుకలు…
నూతన సంవత్సరం సందర్భంగా కార్ఖానాలోని జనక్ పురి కాలనీ ఏబీఎం ప్లాజాలోని ఆర్కేఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఆయన సతీమణి అనుపమ, కుమార్తెలు అదితి, నియతి, సోదరుడి సంతానం సమర్థ్, సమృధ్ లు సీనియర్ సిటిజన్స్ తో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వారితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి అల్పాహారం తినిపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్కేఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే వారి ఆశీస్సులతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలమన్నారు. వృద్ధుల ఆశ్రయం కోసం, వారి వైద్య సాయనికి ఇంత మంచి మెడికల్ హోమ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో వృద్ధాశ్రమాలు అవసరం లేని దేశ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు. అనంతరం డాక్టర్ రామకృష్ణను సీపీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్కేఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ డాక్టర్ రామకృష్ణ, మేనేజర్ నాగభూషణం, డాక్టర్ ఛత్రి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రమోద్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆనంద్, కృష్ణ చౌదరి, జోష్ వెబ్ సైట్ వాలంటీర్ మదన్ కుమార్ పాల్గొన్నారు.