గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలోని రోడామిస్త్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో చిరుతపులి ఆనవాళ్లు కనిపించలేదని చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు. కళాశాల ప్రాంతంలో ఓ చిరుతపులి సంచరిస్తుందని, ఆ పులి ఓ కుక్కను కూడా నోట కరుచుకుని పోయిందని కాలేజీలో వాచ్ వుమన్గా పనిచేస్తున్న కళావతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుందన్న వార్త స్థానికుల్లో తీవ్ర భయాందోళనలను కలిగించింది. కాగా కాలేజీ డైరెక్టర్ వనీలా భాస్కరన్ ఆదివారం అటవీ శాఖ అధికారులకు ఫోన్ కాల్ చేసి సమాచారం అందించడంతో చిలుకూరు రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఇతర సిబ్బంది కలిసి కళాశాల పరిసర ప్రాంతాల్లో చిరుతపులి జాడ కోసం గాలించారు. అందుకు గాను వారు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.


అలాగే అక్కడ ఉన్న భవనాలను జాగ్రత్తగా పరిశీలించారు. అక్కడి నుంచి సుమారుగా 15 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉందని, అందులో కోతులు, కుక్కలు, నెమళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే చిరుతపులి సంచరిస్తున్నట్లుగా దాని జాడ కనిపించలేదని, దాని పాదముద్రలు కూడా కనిపించలేదని అధికారులు తెలిపారు. కాగా ట్రాప్ కెమెరాల ద్వారా తీసిన దృశ్యాలను పరిశీలించగా వారికి కొన్ని కుక్కలు కనిపించాయి. కానీ చిరుతపులి ఆచూకీ లభించలేదు. దీంతో అధికారులు మాట్లాడుతూ.. బహుశా ఆ మహిళ కుక్కను చూసి పులి అనుకుని భయపడి ఉంటుందని, చిరుతపులి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తెలిపారు. అయినప్పటికీ ఇంకొన్ని రోజులపాటు తాము క్షుణ్ణంగా అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తామని తెలిపారు. చిరుతపులి ఆనవాళ్లు కనిపించకపోయినా సరే ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వారు హెచ్చరించారు.





