లింగంపల్లిలో ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. నిందితుల అరెస్ట్..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లింగంపల్లి రైతు బజార్ యూ-టర్న్ సమీపంలో ఆటో డ్రైవర్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో చందానగర్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నవంబర్ 1న రాత్రి సుమారు 11.25 గంటలకు చోటుచేసుకుంది. పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ముస్లాపురం రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. నవంబర్ 1వ తేదీ రాత్రి మెహదీపట్నం నుంచి ఓ ప్రయాణికుడిని లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు ఆటోలో తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో లింగంపల్లి రైతు బజార్ యూ-టర్న్ వద్ద ఆటోను మలుపు తిప్పుతుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆటోను అడ్డగించి ఎందుకు ఆపావంటూ రాజుతో వాగ్వాదానికి దిగాడు.

అనంతరం ఆటో తాళం తీసుకుని రాజుపై దాడి చేయడంతో పాటు దుర్భాషలాడాడు. ఈ క్రమంలో తనను ఎవరికి ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేరంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తన స్నేహితులైన రాహుల్, రాజేష్, రమణలను అక్కడికి పిలిపించి, వారితో కలిసి రాజుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రాజు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి భార్య ముస్లాపురం కవిత (30) ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here