ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం: రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్రకు శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఈ పాదయాత్ర నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న భారతరత్న డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమై మొజంజాహి మార్కెట్ వరకు కొనసాగింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రాజ్యాంగ సంస్థల ప్రాధాన్యత, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, రాజ్యాంగ సంస్థల గౌరవం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజల్లో అపోహలు సృష్టించేలా రాజకీయ ప్రచారాలు చేయడం ప్రజాస్వామ్య చర్చల్లో భాగంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రతి అంశంపై వాస్తవాలను పరిశీలించి, ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here