శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో నవంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న భారత పార్లమెంట్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ప్రజా పద్దుల కమిటీల (PAC) చైర్మన్ల సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బయలుదేరారు.

ఈ మేరకు సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరెకపూడి గాంధీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర PAC చైర్మన్ మనోజ్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. వీరితో పాటు శాసన మండలి కార్యదర్శి డాక్టర్ వి. నర్సింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, అడిషనల్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుధాకర్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. నవంబర్ 3, 4 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ప్రజా పద్దుల కమిటీల పనితీరు, శాసనసభల ఆర్థిక పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.





