చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు స్వర్ణామృత ఔషధ వితరణ కార్యక్రమం

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): డాక్టర్ హెడ్గేవార్ శతజయంతి సేవా సమితి ఆధ్వర్యంలో కొండాపూర్ ప్రశాంత్ నగర్‌లోని శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయ కమిటీ సహకారంతో చిన్నారుల కోసం స్వర్ణామృత ఔషధ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల్లోని చిన్నారులకు స్వర్ణామృతాన్ని అందించనున్నారు.

నిర్వాహకుల వివరాల ప్రకారం స్వర్ణామృతం పిల్లల్లో ఆకలి, జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మేధోశక్తి పెంపొందించడంతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. అలాగే హైపర్ యాక్టివిటీ, ఆటిజం, నత్తి, మాటలు సరిగా రాకపోవడం, మెదడు ఎదుగుదలకు సంబంధించిన సమస్యల విషయంలోనూ ప్రయోజనం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. జలుబు, దగ్గు వంటి కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా, నెలకు ఒకసారి వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్, పి. నర్సింహులు, రమేష్, ఎన్. నర్సింగ్ రావు, గోపాలకృష్ణ తదితరులు సహకారం అందిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లలకు స్వర్ణామృతం అందించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here