సైబరాబాద్‌లో గ్రీన్ ట్యాంకర్ సేవలు ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నీటి సంరక్షణను ప్రోత్సహించడం, మంచినీటి వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఆధ్వర్యంలో గ్రీన్ ట్యాంకర్ సేవలు ప్రారంభమయ్యాయి. సి.ఎం.సి. కమిషనర్ సృజ‌న‌ ముల్లకత్వ మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) వద్ద ఈ సేవలను ప్రారంభించారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB), అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైబరాబాద్ పరిధిలోని పార్కులు, గార్డెన్లు, ల్యాండ్‌స్కేపింగ్, ఇతర తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వినియోగించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ప్రజలు, నివాస సంక్షేమ సంఘాలు (RWAs), విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా శుద్ధి చేసిన ఎస్టీపీ నీటిని పొందేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 155313 కు ఫోన్ చేసి గ్రీన్ ట్యాంకర్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ నీటిని తోటల పెంపకం, పచ్చదనం నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణ పనులు తదితర అనుమతించబడిన అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుని నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి వనరులను సంరక్షించాల్సిన అవసరం ఉందని సి.ఎం.సి. సూచించింది. నీటి వృథాను అరికట్టి, స్థిరమైన నీటి నిర్వహణ విధానాలను అవలంబించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఈ సందర్భంగా కమిషనర్ సృజ‌న మాట్లాడుతూ నివాస సంక్షేమ సంఘాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు తోటల పెంపకం, పచ్చదనం నిర్వహణ, నిర్మాణ పనుల వంటి అవసరాలకు సాధ్యమైనంత వరకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని కోరారు. విలువైన తాగునీటిని అనవసర పనులకు ఉపయోగించకుండా పొదుపు చేయాలని సూచించారు. మురుగునీటి పునర్వినియోగాన్ని పెంచడం, మంచినీటి వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సైబరాబాద్ పరిధిలో పట్టణ పచ్చదనాన్ని స్థిరంగా అభివృద్ధి చేయడం దిశగా గ్రీన్ ట్యాంకర్ సేవలు కీలకంగా నిలవనున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here