శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ యువతి అదృశ్యమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన కుమార్తె బోయిని మౌనికను వరప్రసాద్ అనే యువకుడు ప్రేమ పేరుతో తమకు తెలియకుండా తీసుకెళ్లాడని ఆరోపిస్తూ ఆమె తండ్రి బోయిని తుకారాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం నాగన్నపల్లి గ్రామానికి చెందిన బోయిని తుకారాం గత 15 ఏళ్లుగా నల్లగండ్లలోని అస్తా గ్రీన్ హోమ్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ నివసిస్తున్నాడు. అతనికి ముగ్గురు సంతానం కాగా, పెద్ద కుమార్తె బోయిని మౌనిక (21) ఇంటర్మీడియట్ చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది.

సుమారు రెండు నెలల క్రితం మౌనిక తన తండ్రితో వరప్రసాద్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే ఈ సంబంధానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మరో యువకుడితో వివాహం చేయాలని భావించారు. ఈ క్రమంలో అక్టోబర్ 31న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుకారాం ఇంట్లో నిద్రిస్తుండగా, మౌనిక స్నానం చేస్తానని చెప్పి దుస్తులు తీసుకుని బయటకు వెళ్లింది. కొంతసేపటి తర్వాత రెండో కుమార్తె మమత వచ్చి అక్క ఇంట్లో లేదని తండ్రికి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. బంధువులకు ఫోన్ చేసి విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో వరప్రసాద్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన కుమార్తె ఆచూకీ కనుగొని, కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తుకారాం చందానగర్ పోలీసులను కోరాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.





