గచ్చిబౌలి మారథాన్‌లో విషాదం.. మెడల్ అందుకున్న కొద్దిసేపటికే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మారథాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మెడల్ అందుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో NEB సంస్థ నిర్వహించిన మారథాన్‌లో అల్కాపూర్ కాలనీ, మణికొండకు చెందిన కొమ్మినేని గోపి (36) పాల్గొన్నాడు. అత‌ను IBM సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

మారథాన్‌ను పూర్తి చేసి మెడల్ అందుకున్న అనంతరం అల్పాహారం కోసం వెళ్తుండగా గోపి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన నిర్వాహక బృందం అత‌న్ని చికిత్స నిమిత్తం CARE ఆసుపత్రికి తరలించింది. అయితే, ఉదయం సుమారు 8:45 గంటలకు అత‌ను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు కారణంగా గోపి మృతి చెందినట్లు తెలుస్తోంది. మారథాన్‌లో ఉత్సాహంగా పాల్గొని, లక్ష్యాన్ని పూర్తి చేసిన కొద్దిసేపటికే అత‌ను ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here