శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో రాబోయే రోజుల్లో నీటి కొరత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున, వచ్చే వర్షాకాలం వరకు కొత్త బోర్ల తవ్వకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బోరు బండ్ల యజమానులు, నూతన నిర్మాణదారులు ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోర్ల తవ్వకాలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని మల్లారెడ్డి కోరారు. అనుమతులు లేకుండా బోర్లు తవ్వకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు నిస్వార్థంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

నీటి ట్యాంకర్ల ధరలు భారీగా పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని మల్లారెడ్డి ఆరోపించారు. గతంలో రూ.500కు లభించిన నీటి ట్యాంకర్‌కు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ట్యాంకర్ల ధరలను నియంత్రించి, ప్రజలకు సరసమైన ధరలకు సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టళ్లకు కొందరు ప్రైవేటు సరఫరాదారులు కలుషిత నీటిని విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, నీటి నాణ్యతను పరీక్షించాలని డిమాండ్ చేశారు.
కొత్త ధాన్యం మార్కెట్లోకి రాకముందే పాత ధాన్యం బస్తా ధరను వ్యాపారులు రూ.వెయ్యి వరకు పెంచుతున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వ్యాపారుల నిల్వలను తనిఖీ చేసి, అక్రమ నిల్వలు, కృత్రిమ ధరల పెరుగుదలను అరికట్టాలని కోరారు. ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
శేరిలింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, సంబంధిత అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, ట్యాంకర్ల అధిక ధరలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ప్రజలకు సురక్షిత తాగునీరు, ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.





