శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్‌లో ఉన్న శ్రీ మల్లన్న దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భూమిపై అవతరించిన అవతార పురుషుడు శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, మాజీ కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినమని గాంధీ పేర్కొన్నారు. ఈ పర్వదినాన్ని కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి అనే పేర్లతో కూడా పిలుస్తారని తెలిపారు. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం, కృపాకటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎండీ ఇబ్రహీం, ఐలేష్ యాదవ్, కిట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






