రూ.45 కోట్లతో NH-65 నుంచి అమీన్‌పూర్ వరకు రహదారి విస్తరణ.. పనులు వేగవంతం చేయాలి: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చేపడుతున్న రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. చందానగర్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి NH-65 నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డు మీదుగా అమీన్‌పూర్ వరకు రూ.45 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మాజీ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డుకు కలిపే లింక్ రోడ్డు పనులతో పాటు నాలాపై నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు నిర్మాణ పనులను గాంధీ పరిశీలించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. 2.7 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల రహదారి, 2 లేన్ల సర్వీస్ రహదారి విస్తరణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. లింక్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నాలాపై నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు ద్వారా నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాంధీ పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డుకు అనుసంధానించే లింక్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు, పనుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here