శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి అన్నమ స్వరార్చన, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎస్.వి.ఎస్. కళా నికేతన్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య గురువు డా. హేమ వనసర్ల శిక్షణలో శిష్యులు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

వినాయక కౌత్వం, గోదా కళ్యాణం, భద్రశైల రాజమందిర, పలుకే బంగారమాయెనా, అష్టలక్ష్మీ, పుష్పాంజలి, తారంగం, జనుత శబ్దం, రామ చంద్రాయ, ముద్దుగారె యశోద, బాలకనకమయా తదితర కీర్తనలకు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు, కళాభిమానులు నృత్య ప్రదర్శనలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా డా. శోభా రాజు శ్రీకృష్ణ జయంతి విశిష్టతను వివరిస్తూ, శ్రీకృష్ణుడి లీలలను భక్తులకు వివరించారు. తన అనుభవాలను జోడిస్తూ నవ యువతలో ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువల పట్ల ఆసక్తిని పెంపొందించేలా ప్రసంగించారు. అనంతరం నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న కళాకారులకు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. చివరగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. అనంతరం వేడుకలకు హాజరైన భక్తులకు శ్రీకృష్ణ నవనీతం, రుచికరమైన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.






