శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్ డివిజన్, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్‌లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ కోరారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగిన హైడ్రా కూల్చివేతల కారణంగా భవనం, బాత్రూంలు దెబ్బతిన్నాయని, వాటికి వెంటనే మరమ్మత్తులు చేపట్టి పునరుద్ధరించాలని కోరారు. అంజయ్య నగర్, ఇందిరా నగర్ శ్మశానవాటికల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

అలాగే బెల్ట్ షాపుల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు మెయిన్ రోడ్డును దాటే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని, ఇప్పటికే ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీ స్థలాలు కబ్జాలకు గురికాకుండా వాటిలో అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక నిమజ్జనం సమయంలో ప్రజలు, భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లపై ఉన్న గుంతలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అవసరమైన చోట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అన్నారు. కాలనీల్లో పనికిరాకుండా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని, వీధిలైట్లు లేని ప్రాంతాల్లో కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్లపై చెత్తాచెదారం, మురుగునీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై కమిషనర్ సృజన సానుకూలంగా స్పందిస్తూ, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని రవికుమార్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, కార్యదర్శి మణిభూషణ్, మాణిక్ రావు, డివిజన్ అధ్యక్షుడు రవి నాయక్, జితేందర్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు విజయేందర్, సీనియర్ నాయకులు గణేష్, సంజీవ్, వెంకటేష్, ఆమని, సహదేవ్, ధనరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





