మైనారిటీ మహిళలకు రూ.50 వేల ఆర్థిక చేయూత

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం కింద శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. కొంగర కలాన్‌లోని రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 278 మంది లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో మొత్తం రూ.1.39 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, శంకర్, అదనపు కలెక్టర్ కిరణ్మయి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, యాదవ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ తదితరులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు గాంధీ తెలిపారు. ఈ మొత్తంతో చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు మహిళలు స్వతంత్రంగా ఆదాయం పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని అన్నారు. మైనారిటీ మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచి వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

కార్యక్రమంలో తుర్క కాశ మైనారిటీ వర్గాలకు స్టోన్ కటింగ్ జనరేటర్లు, టూల్ కిట్లను కూడా పంపిణీ చేశారు. రాళ్ల కటింగ్ పనులకు గతంలో ఎక్కువ శ్రమ, సమయం పట్టేదని గాంధీ తెలిపారు. జనరేటర్లు, టూల్ కిట్ల అందుబాటుతో సమయం ఆదా కావడంతో పాటు శ్రమ తగ్గి, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. తద్వారా వారి ఆదాయం పెరిగి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రూ.50 వేల ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here