మియాపూర్‌ డివిజన్‌లో కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధికి అండగా ఉంటామని మాజీ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, PAC ఛైర్మన్‌ ఆరెకపూడి గాంధీ సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, శ్రీ సాయి నగర్‌ కాలనీలకు చెందిన పలువురు నివాసులు శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీల్లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై శ్రీకాంత్‌ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లోని సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు త్వరలో పర్యటిస్తానని తెలిపారు. ప్రజలకు నిత్యజీవితంలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని శ్రీకాంత్‌ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని స్పష్టం చేశారు. మియాపూర్‌ డివిజన్‌లోని ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని, ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించేలా మౌలిక వసతులు కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తానని శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ వాసులు దేవేందర్‌ రావు, మాధవరం గోపాల్‌ రావు, మురళి, లక్ష్మీనారాయణ, శ్రీ సాయి నగర్‌ కాలనీ వాసులు కరిముల్లా, శ్రీకాంత్‌ చౌదరి, వెంకట రమణ, ప్రశాంత్‌ రెడ్డి, రాజారెడ్డి, ప్రకాష్‌ రెడ్డి, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here