సైబరాబాద్‌ అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. 7వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) 7వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA & UD) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎంసీ కమిషనర్ సృజ‌న‌, జోనల్ కమిషనర్లు, వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు. సీఎంసీ పరిధిలో పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, బాలల అనుకూల పాలన, క్రీడా మౌలిక వసతులు, ప్రజా సేవలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది.

బర్లకుంట, శ్రీరామ్‌నగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో పర్యావరణహిత కార్యక్రమాలను నియంత్రిత విధానంలో నిర్వహించేందుకు చర్యలు చేప‌ట్ట‌డం, అమీన్‌పూర్‌లో రోజుకు 50 టన్నుల సామర్థ్యంతో బయో-మీథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌డం, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద ఈ ప్రాజెక్టును చేపట్టడం, పారిశుద్ధ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ వాహనాలు, ట్రక్‌-మౌంటెడ్ స్కిప్ లోడర్ల కొనుగోలు, యూనిసెఫ్ సహకారంతో సీఎంసీని బాలల అనుకూల, సురక్షిత మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేప‌ట్ట‌డం, బాచుపల్లి నుంచి మల్లన్న టెంపుల్, నిజాంపేట్ రోడ్ వరకు ప్రతిపాదిత 30 మీటర్ల వెడల్పు రహదారి అభివృద్ధికి రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్, మహదేవపురం ఎక్స్‌ రోడ్ నుంచి గాజులరామారం జంక్షన్ వరకు రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, మహదేవపురంలోని యానిమల్ కేర్ సెంటర్‌లో డాగ్ షెల్టర్ల విస్తరణ, మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలో UCI ఒలింపిక్ ప్రమాణాలతో 5 మీటర్లు, 8 మీటర్ల డ్యుయల్ హిల్ BMX సూపర్‌క్రాస్ ట్రాక్ అభివృద్ధి, సీఎంసీ కార్యాలయాలు, పార్కులు, ఆస్తులు, సైనేజీలపై అధికారిక సీఎంసీ లోగో అమలు, నల్లగండ్ల ఎక్స్‌ రోడ్ నుంచి తెల్లాపూర్ రోడ్ వరకు CSR సహకారంతో సెంట్రల్ గ్రీనరీ అభివృద్ధి, నిర్వహణ, చికెన్ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేందుకు, EOI ప్రక్రియ ద్వారా గ్రీన్ వేస్ట్-టు-బయో బ్రిక్వెట్ ప్లాంట్ ఏర్పాటు త‌దిత‌ర అభివృద్ధి ప‌నులు, కార్య‌క్ర‌మాల‌కు ఆమోదం తెలిపారు.

ఈ నిర్ణయాల ద్వారా సీఎంసీ పరిధిలో రహదారులు, పారిశుద్ధ్య వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, క్రీడా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అలాగే బాలల భద్రత, ప్రజా సేవలు, సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం లభించనుంది. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన ప్రతిపాదనలను నిర్దేశిత విధివిధానాలకు అనుగుణంగా అమలు చేసేందుకు సీఎంసీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here