శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేరారు. ఆయా పార్టీలకు రాజీనామా చేసిన నాయకులు టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ బండారు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బంధారపు నర్సయ్య గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం షాద్నగర్ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా సంతోష్, ఉపాధ్యక్షుడిగా మీది కేరి రాధాకృష్ణ, కొందుర్గ్ మండల ఉపాధ్యక్షుడిగా మిద్దె ఎల్లరాజు, చౌదరిగూడ మండల అధ్యక్షుడిగా దుర్తల రాములు, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా బుస్సా జంగయ్య మంగలిని నియమించారు. నూతనంగా నియమితులైన నాయకులకు తీన్మార్ మల్లన్న నియామక పత్రాలు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణలో సామాజిక న్యాయం, బహుజన రాజ్యాధికార సాధన కోసం టీఆర్పీ కట్టుబడి పనిచేస్తోందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీన్మార్ మల్లన్న చేపట్టనున్న పాదయాత్రను చారిత్రాత్మక విజయంగా నిలిపేందుకు రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేపడతామని తెలిపారు. మహిళలు, యువత, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలో టీఆర్పీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామం, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి, శేరిలింగంపల్లి జనరల్ సెక్రటరీ కురుమూర్తి ముదిరాజ్, శేరిలింగంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీకాంత్తో పాటు పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





