చందానగర్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లను తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను చందానగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.96,475 విలువైన 227 స్టెరాయిడ్‌ ఇంజెక్షన్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. మంగ‌ళ‌వారం ఉదయం 10 గంటల సమయంలో చందానగర్‌లోని పీజేఆర్‌ స్టేడియం వద్ద ఇద్దరు వ్యక్తులు హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిని సారా సాయిరాం (39), కుంచాల రవీందర్‌ (25)గా గుర్తించారు.

వారిని తనిఖీ చేయగా ఒక కార్టన్‌ బాక్స్‌లో 10 మిల్లీలీటర్ల చొప్పున ఉన్న 227 స్టెరాయిడ్‌ ఇంజెక్షన్‌ బాటిళ్లు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్ల విలువ సుమారు రూ.96,475గా అంచనా వేశారు. విచారణలో సాయిరాం మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నట్లు, ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.37కు కొనుగోలు చేసి రూ.425కు విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు రవీందర్‌ జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తూ, ఇంజెక్షన్లను కొనుగోలు చేసి జిమ్‌ కస్టమర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇంజెక్షన్లను విక్రయించేందుకు అవసరమైన ఎలాంటి లైసెన్స్‌, అనుమతులు నిందితుల వద్ద లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here