శేరిలింగంపల్లి, ఆగస్టు 31 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్‌బండ విలేజ్‌లో నిర్వహించిన ఫలహారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయాలకు రూ.30.71 లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారని, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకునేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





