శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేటలోని దీప్తిశ్రీనగర్ సర్వే నంబర్ 151లో సర్కారీ శిఖం భూమిలో బై నంబర్లతో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంపై శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. సదరు స్థలం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ నిర్మాణ ప్రదేశంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని స్పష్టం చేస్తూ.. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా, నిర్మాణ పనులను కొనసాగించినా చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ భూఆక్రమణ చట్టం-1905 ప్రకారం న్యాయపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిర్మాణానికి ఏర్పాటు చేసిన బ్యానర్లో స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి స్పందిస్తూ.. సదరు నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి, 1202+374 గజాల మొత్తం చెరువు సర్కారీ శిఖం స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించాలని, కబ్జాదారులతో దోబూచులాడే విధానాన్ని మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకుని, ప్రజా ప్రయోజనాల కోసం వాటిని పరిరక్షించాలని భాస్కరరెడ్డి కోరారు.





