శిల్పారామంలో ఘనంగా శ్రీకృష్ణ నర్తనం.. చిన్నారుల నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకులు ఫిదా

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శిల్పారామంలో శ్రీకృష్ణ నర్తనం సాంస్కృతిక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సిరి ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్, సత్య కృష్ణ కూచిపూడి కళా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారుల అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుడి బాల్య లీలలు, పౌరాణిక ఘట్టాలను చిన్నారులు తమ నృత్యాభినయంతో కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. చెరసాలలో శ్రీకృష్ణుని జన్మ ఘట్టం, గోవర్ధనగిరిని ఎత్తిన సందర్భం సహా పలు కీలక ఘట్టాలను హావభావాలు, అభినయంతో అద్భుతంగా ప్రదర్శించారు. చివరగా కంస వధ ఘట్టంతో శ్రీకృష్ణ నర్తనం ఉత్సాహభరితంగా ముగిసింది.

చిన్నారుల హావభావాలు, నృత్య నైపుణ్యం, అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. శిల్పారామానికి విచ్చేసిన పర్యాటకులు, కళాభిమానులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన బాల కళాకారులను రష్యన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జా దంపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంగిరాల పురుషోత్తం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీస్తున్న గురువులను అభినందించారు. చిన్నారులకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ అందిస్తూ వారిని తీర్చిదిద్దుతున్న గురువుల కృషిని కొనియాడారు. సాంప్రదాయ కళలు, పౌరాణిక కథనాలను చిన్నారుల నృత్య రూపకాల ద్వారా ప్రేక్షకులకు అందించిన ఈ కార్యక్రమం శిల్పారామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here