శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మూడు జోన్ల పరిధిలో టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 22 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న భవనాలపై చర్యలు తీసుకుంటూ 14 భవనాలను కూల్చివేశారు. మరో రెండు నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు.

గుర్తించిన మిగిలిన ఆరు కేసులను తదుపరి కూల్చివేత చర్యల కోసం నిర్దేశిత విధానం, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చర్యలు తీసుకునేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సీఎంసీ కమిషనర్ సృజన సంబంధిత టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఆదేశించారు. అక్రమ నిర్మాణాలపై నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలను కొనసాగిస్తామని సీఎంసీ అధికారులు తెలిపారు.






