సెప్టెంబర్ 2 నుంచి ఇంటింటికీ బీఆర్‌ఎస్‌ ప్రచారం.. కాంగ్రెస్‌ హామీలపై ప్రజలకు వివరణ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం తన క్యాంపు కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవడమే కాకుండా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించారు.

సెప్టెంబర్ 2 నుంచి ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ నిలుస్తుందని, ప్రజలకు అండగా ఉంటుందనే భరోసాను కల్పించాలని నాయకులకు పిలుపునిచ్చారు. అలాగే ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision)పై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ఓట్లు గల్లంతైన వారికి తిరిగి ఓటు హక్కు కల్పించేలా అవసరమైన సహకారం అందించాలని, ఓటు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన దిశానిర్దేశం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. అదేవిధంగా 22-ఎ సెక్షన్‌కు సంబంధించి ప్రజల ఆస్తుల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి, వారికి అండగా నిలవాలని మాధవరం కృష్ణారావు సూచించారు. ప్రజలకు ధైర్యం కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here