అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: జగదీశ్వర్‌ గౌడ్‌

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఓటు హక్కు మన హక్కు.. ఓటు రక్షణ మన బాధ్యత. ఓటు ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ప్రతి ఓటును కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్‌ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాల మేరకు మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని నరేన్‌ గార్డెన్‌లో నిర్వహించిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-2 (SIR-2) కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి జ్ఞానేశ్వర్‌, గాంధీభవన్‌ ప్రత్యేక ఆహ్వానితుడు జగదీశ్వర్‌ గౌడ్‌, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బారావు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (BLAలు) బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కొత్తగా అర్హత పొందిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించడం ప్రధాన లక్ష్యమని జగదీశ్వర్‌ గౌడ్‌ తెలిపారు. అర్హులైన ప్ర‌తి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదుకాకుండా మిగిలిపోకూడదని, అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి బూత్‌లోని ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించాలని, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకుల పేర్లను నమోదు చేయించాలని, ఓటరు జాబితాలో పేరు లేకపోతే Form-6 ద్వారా నమోదు చేయించాలని తెలిపారు. పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసేందుకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని సూచించారు.

ప్రతి BLA తన పరిధిలో ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయకుండా బాధ్యత తీసుకోవాలని, ప్రతి కుటుంబాన్ని కలిసి పేరు ఓటరు జాబితాలో ఉందా అని నిర్ధారించాలని జగదీశ్వర్‌ గౌడ్‌ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, బ్లాక్‌, మండల స్థాయి నాయకులు, INTUC, TPCC లేబర్‌ సెల్‌, యువజన కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌, ఇతర ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, BLAలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here