శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): నియోజకవర్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండ వరకు సుమారు రూ.1 కోటి అంచనా వ్యయంతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కూడా ఆయన వెంట ఉన్నారు. బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండ వరకు నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉంటోందని గాంధీ పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యామ్నాయ రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని గాంధీ చెప్పారు. రోడ్డు విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గి ప్రజలకు ఎంతో ఉపశమనం లభిస్తుందని తెలిపారు. రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను గాంధీ ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు టౌన్ ప్లానింగ్, CMC ఇంజనీరింగ్ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో CMC ఇంజనీరింగ్ విభాగం DE ఆనంద్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చాంద్ పాషా, భూపేశ్వర్, భాస్కర్ రెడ్డి, బాలకృష్ణతో పాటు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





