అన్నమయ్యపురంలో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వరుడికి కూచిపూడి-భరతనాట్య నృత్యార్చన

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీదేవి నాట్యాలయ ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్య నృత్యార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి నాట్యాలయ గురువు శ్రీదేవి అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.

అనంతరం శ్రీదేవి నాట్యాలయ శిష్యులు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనల ద్వారా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి నృత్య కైంకర్యం సమర్పించారు. కూచిపూడిలో సంవిత, అక్షయ, సత్యవాణి, లక్ష్మీ శ్రావణి, బృందవి, కనిష్క, అక్షర, శ్రావణి పట్వారీ, మోక్ష తదితరులు పాల్గొన్నారు. భరతనాట్యంలో ఎన్. మోక్ష, ఎన్. హాసిని, ఆశ్రిత, మేధ, రిధి, అన్విత, నిహాన్సా, ధార్మికి, ప్రహర్షిత, సాన్వి, స్మితిక, ఐశ్వర్య, మనుశ్రీ, ఖ్యాతి, ఎల్. శ్రావణి, వంశిక, ప్రణతి జి., రీవా, ఆద్రిక, ధన్విక తదితరులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కృష్ణం కలయ సఖి, సతులారా చూడరే, తిరు తిరు జవరాల, కల్యాణ రామ, తాండవ గణపతి, మూషిక వాహన, అలరిపు, డోలాయాంచల, గరుడ గమన, పుష్పాంజలి, నారాయణతే, జనుత శబ్దం వంటి భక్తిరసభరితమైన సంకీర్తనలు, నృత్యరూపకాలను కళాకారులు లయ, తాళం, భావాభినయ సమన్వయంతో ప్రదర్శించారు. నృత్య కదలికలు, హస్తముద్రలు, భావాభినయంతో అన్నమయ్య సంకీర్తనల్లోని భక్తితత్వాన్ని కళాకారులు ఆవిష్కరించడంతో కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అన్నమాచార్య భావనా వాహిని తరఫున సంస్థ అధ్యక్షురాలు పద్మశ్రీ డా. శోభారాజు, మేనేజింగ్ డైరెక్టర్ డా. నందకుమార్ సంయుక్తంగా కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను అభినందించారు. అనంతరం వారికి శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారి ప్రతిమలను బహుకరించారు. అన్నమయ్య సంకీర్తనలను నృత్యరూపంలో భక్తులకు చేరువ చేస్తున్న శ్రీదేవి నాట్యాలయ గురువు శ్రీదేవి అరుణ్ కుమార్ కృషిని వారు ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి అంగనలీరే మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో నృత్యార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here