శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఉన్నతస్థాయి ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎంసీ పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, నీటిపారుదల, విద్యుత్, ఆర్అండ్బీ, జలమండలి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నిమజ్జన ఊరేగింపులు జరిగే మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనుంది. నిమజ్జన ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందుగానే డైవర్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. హైడ్రా, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా నిమజ్జన చెరువుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు, లైటింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు చెరువుల పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గణేష్ విగ్రహాల ఊరేగింపులు సాగే ప్రధాన రహదారుల్లో గుంతలను వెంటనే పూడ్చివేయాలని ఆర్అండ్బీ, సీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం రోజుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖకు సూచించారు. విద్యుత్ వైర్లను ముందస్తుగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఉత్సవ ప్రాంతాలు, నిమజ్జన ఘాట్ల వద్ద నిరంతర తాగునీటి సరఫరా కోసం జలమండలి ఏర్పాట్లు చేయనుంది. అదే విధంగా CMC పారిశుద్ధ్య విభాగం నిరంతరం చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉత్సవ కమిటీలకు అధికారులు పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని నారాయణ్ అమిత్ తెలిపారు. సమావేశంలో అన్ని సర్కిళ్ల ఉప కమిషనర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





