కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్‌ పనులు వేగవంతం చేయాలి: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని మరింత బలోపేతం చేసి పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సూచించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వర్ణకుమారి, ఇన్‌చార్జ్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సుధాకర్ బండారి, ఇన్‌చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకృష్ణ, కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆసుపత్రి అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే పరమావధిగా వైద్యులు సేవలందించాలని అన్నారు. వైద్యులు కనిపించే దేవుళ్లతో సమానమని, పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్యం, శుభ్రత, అత్యవసర వైద్య సేవలకు సంబంధించి పలు తీర్మానాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానాలను త్వరితగతిన అమలు చేయడంతోపాటు రోగులకు అందించే సేవలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించారు.

అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం భవన నిర్మాణ పనులను గాంధీ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే కొండాపూర్‌తోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని గాంధీ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది నాయకులు రఘునాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బలరాం యాదవ్, తిరుపతి, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here