కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగించాలి: కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సహా పేదల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్‌ నానక్‌రాంగూడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన ఈ ర్యాలీ గచ్చిబౌలి డివిజన్‌ పార్టీ కార్యాలయం నుంచి నానక్‌రాంగూడలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు సాగింది. శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అనంతరం అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష చెక్కుతో పాటు లబ్ధిదారులకు తులం బంగారం తక్షణమే అందించాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 5 వేల మంది ఆడబిడ్డలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తులం బంగారం బకాయి పడిందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.13 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించామని ఆయన పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్‌, ఆసరా పింఛన్‌ రూ.4వేలు వంటి ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్లు, కంటి వెలుగు వంటి పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. కళ్యాణలక్ష్మి పథకంపై కోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని కోరారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, అందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని సాయిబాబా అన్నారు. పేదల సంక్షేమంపై ప్రభుత్వం వెనక్కి తగ్గితే ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంజమ్మ, బాలమణి, మాధవి, సుగుణ, రాగం జంగయ్య యాదవ్‌, రాగం హరి శంకర్‌ యాదవ్‌, సతీష్‌ ముదిరాజ్‌, నారాయణ, నరేష్‌ సింగ్‌, అనిల్‌ సింగ్‌, మధుకుమార్‌, ఖాదర్‌ ఖాన్‌, రమేష్‌ గౌడ్‌, ప్రభాకర్‌, అజీమ్‌, థాహెర్‌, బురాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here